5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో గర్భిణీ స్త్రీలు, శిశు ఆరోగ్యం, టీకా కార్యక్రమాలు, వ్యాధుల నివారణ చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మాణ దశలో ఉన్న, పూర్తి కావస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన అదనపు నిధులు మంజూరు చేయాలని, ఆసుపత్రుల్లో ఔషధాల లభ్యత, మౌలిక వసతులు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరతను వెంటనే భర్తీ చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లారు.అలాగే నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పలు ప్రతిపాదనలు సమర్పించారు.
ప్రధాన ప్రతిపాదనలు...
చందూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నిర్మాణం పూర్తి చేసేందుకు అదనంగా రూ.40 లక్షలు మంజూరు చేయాలి.
వర్ని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేసి కిడ్నీ రోగులకు చికిత్స అందించాలి.
వర్ని ఆసుపత్రికి అవసరమైన వైద్య, పారామెడికల్ సిబ్బంది, ఆధునిక పరికరాలు మంజూరు చేయాలి.
నిర్మాణం పూర్తికి చేరుకున్న కోటగిరి 50 పడకల ఆసుపత్రికి సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి.
తుది దశలో ఉన్న బాన్సువాడ 100 పడకల ఏరియా ఆసుపత్రికి ఆధునిక వైద్య పరికరాలు, ఐసీయూ, ల్యాబ్ పరికరాలు, ఫర్నిచర్ మంజూరు చేయాలి.
బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రి (MCH), ఏరియా ఆసుపత్రి (AH)లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సమావేశంలో మంత్రి దామోదర్ రాజనరసింహ బాన్సువాడ నియోజకవర్గ ఆసుపత్రుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
Banswada News
హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం.
Quick Summary:
బాన్సువాడ నియోజకవర్గ ఆసుపత్రులకు నిధులు, సౌకర్యాలు కోరిన ఎమ్మెల్యే పోచారం.

